జాఫర్గడ్, 2026-11-21
గంజాయి కట్టడికి నిరంతర నిఘా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి జఫర్గఢ్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో వరంగల్ సీపీ ఎన్.శ్వేత
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతోపాటు, బాధితుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్, పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. శనివారం జఫర్గఢ్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆమె వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సీపీకి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ ఎన్.శ్వేత ఉసిరి మొక్కను నాటారు. స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలను పరిశీలించి, వాటి నిర్వహణ తీరును క్షుణ్ణంగా సమీక్షించారు. పెండింగ్ కేసులు, విధుల నిర్వహణ, సిబ్బంది పనితీరుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను అర్థం చేసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ ఎన్.శ్వేత మాట్లాడుతూ... పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని, చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ ఆదేశించారు. గంజాయి వినియోగం, విక్రయాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించేందుకు నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించడంతోపాటు, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీసు విధులు ఒత్తిడితో కూడుకున్నవైనప్పటికీ సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని సీపీ పేర్కొన్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, ప్రజల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ వార్షిక తనిఖీలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, వర్ధన్నపేట సీఐ వై.సంజీవరావు, జఫర్గఢ్ ఎస్ఐ బొల్లం వినయ్ కుమార్, వర్ధన్నపేట ఎస్ఐ బోగం ప్రవీణ్, జఫర్గఢ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







