కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 14
సిద్దిపేట జిల్లా మండలం బస్వాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని, పిల్లల పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) మైపాల్ రెడ్డి గ్రామ సర్పంచ్ లింగం నాయక్, నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. బాలలే దేశ భవిష్యత్తు, రేపటి సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.
విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా, సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. చదువుతో పాటు నైతిక విలువలు, మానవతా దృక్పథం, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి తమలోని ప్రతిభను గుర్తించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) పద్మయ్య, ఎంపీడీవో రవీందర్ రెడ్డి గ్రామ సెక్రెటరీ సదానందం గ్రామ ఉపసర్పంచ్ ప్రవీణ్ గ్రామ వార్డు నెంబర్ బండి సంపత్ గ్రామస్తులు ఇక్బాల్ శ్రీను తిరుపతి రాజు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొని బాలల దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.






