రాజేంద్రనగర్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 14
మాయమాటలు చెప్పి యువకుడితో పంపిన మహిళపై ఆరోపణలు.. పోలీసుల గాలింపు
రాజేంద్రనగర్ లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేపింది. స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన బాలిక సాయంత్రం ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. బిడ్డ ఆచూకీ కోసం చుట్టుపక్కల తీవ్రంగా వెతికి, బంధువులకు ఫోన్లు చేసి ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ కనిపించకుండా పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది.
మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, ఒక మహిళ ఓ యువకుడితో పంపించిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకుడి కోసం పోలీసుల గాలింపులు ముమ్మరంగా సాగుతున్నాయి.


