హుస్నాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం హుస్నాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో ఓటర్ల జాబితా సవరణ అంశంపై నిరసన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర ఇండియా కూటమి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనను నిరసిస్తూ, పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన నిరసనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను బలహీనపరుస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రతిపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామిక చర్య అని మంత్రి పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మాజీ గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










