కొహెడ, 2026-11-20
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించబడుతుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకం నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండలం, తంగళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, దేశంలోనే తొలిసారిగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించే గొప్ప కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు. గతంలో ఎక్స్గ్రేషియా వంటి ఆర్థిక సహాయాలు ప్రధానంగా భూమి కలిగిన రైతులకే పరిమితమయ్యేవని, ప్రస్తుతం ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు వివరించారు. ఈ పథకానికి లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన కుటుంబాలు సంబంధిత ఫారమ్ ద్వారా నమోదు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామాల్లో గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీడీవోలు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతి కుటుంబానికి పథకం చేరేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదే రోజున కొత్తగా మంజూరైన 4.75 లక్షల చేయూత పింఛన్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఇళ్లు లేని అర్హులైన మిగిలిన కుటుంబాలకు కూడా ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం, పేదలకు సొంత ఇల్లు అందించడం, ప్రజల సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.



