సిద్దిపేట జిల్లా బీసీ సంఘాల సమస్యలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోని బీసీ సంఘాలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సయ్యద్ రఫీక్‌ను కలిసి సమస్యలను వివరించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సయ్యద్ రఫీక్‌ను బీసీ సంఘాల నాయకులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా నాయిబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కొత్వాల్ యాదనరేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా జిల్లా కేంద్రంలో బీసీ సంఘాలతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. బీసీ కుల సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తాయని, తమ సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక వేదిక అవసరమని ఆయన అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వంటి కార్యక్రమాల్లోనూ బీసీ సంఘాలతో మంత్రి పాల్గొని, వారి సమస్యలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ పోరుబిడ్డ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆహ్వానించాలని బీసీ సంక్షేమ అధికారిని కోరారు. జిల్లాలోని అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించి, వారి సమస్యలను వినే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరై బీసీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట రజక సంఘాల అధ్యక్షుడు భూంపల్లి లింగస్వామి, నారాయణరావుపేట శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు భూంపల్లి రాజలింగం, అంతగిరి కనకయ్య, ఉపాధ్యక్షుడు చెవిటి అశోక్, ప్రధాన కార్యదర్శి చెవిటి గణేష్, కోశాధికారి అంతగిరి పోచయ్య, సలహాదారు చెవిటి పరశురాములు, మిరుదొడ్డి రాములు, భూంపల్లి చంద్రం, మండలం మాజీ ఎంపీటీసీ రాయగల దుర్గయ్య, సింజోజు మురళీకృష్ణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.












