అమెరికాకు చెందిన 25 ఏళ్ల యువ ఇంజినీర్ జునైద్ ఖాన్, ఏడాదికి రూ.1.9 కోట్లకు పైగా ఆదాయం వచ్చే మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలి, తన సొంత కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం తన వద్ద ఉన్న పొదుపు డబ్బుతోనే స్టార్టప్‌ను నడుపుతూ, వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు.
జునైద్ ఖాన్ 2023లో కంప్యూటర్ సైన్స్ చదువు పూర్తి చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పూర్తిస్థాయి ఉద్యోగంలో చేరాడు. ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల విస్తరణకు సంబంధించిన పనుల్లో పాల్గొన్నాడు. ఏఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ప్రముఖ సాంకేతిక సంస్థలో పనిచేసే అవకాశం అతడికి లభించింది.
అయితే, 2025 ప్రారంభంలో సంస్థలో కొన్ని సేవలకు అంతరాయాలు ఏర్పడిన తర్వాత భద్రత, సేవల స్థిరత్వానికి అధిక ప్రాధాన్యం పెరిగిందని అతను తెలిపాడు. దీంతో కొత్త ఉత్పత్తులను వేగంగా అభివృద్ధి చేసే ప్రక్రియ మందగించినట్లు తనకు అనిపించిందని వివరించాడు. అదే సమయంలో కొత్త ఏఐ సాధనాలు అందుబాటులోకి రావడంతో వాటిని ఉపయోగించి సొంతంగా ఉత్పత్తులను రూపొందించాలనే ఆసక్తి పెరిగింది.
2024లో జీతం, బోనస్‌లు, కంపెనీ షేర్లతో కలిపి అతడి వార్షిక ఆదాయం 2 లక్షల డాలర్లకు పైగా ఉంది. అయినప్పటికీ, తనకు నచ్చిన రంగంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, స్వతంత్రంగా వ్యాపారం నిర్మించడం ముఖ్యమని భావించి ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
ఏఐతో వ్యక్తిగత ఆర్థిక సలహా
జునైద్ ప్రారంభించిన సంస్థ పేరు ట్రెజరీ (). ఇది ఏఐ ఆధారంగా వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మార్గదర్శకత్వం అందించే సాధనం. ఆదాయం, ఖర్చులు, పొదుపు వంటి అంశాలను అర్థం చేసుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో వినియోగదారులకు సాయం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
బ్రిటన్‌లో పుట్టి పెరిగిన జునైద్, ఉన్నత విద్య కోసం 2019లో అమెరికాకు వెళ్లాడు. రెండు దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేటప్పుడు ఎదురైన సమస్యలే ఈ ఆలోచనకు ప్రేరణగా నిలిచాయి. ఖరీదైన ఆర్థిక సలహాదారుల సేవలను పొందలేని సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని భావించాడు.
మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న సమయంలోనే సాయంత్రాలు, వారాంతాల్లో ట్రెజరీని అభివృద్ధి చేశాడు. దాదాపు రెండేళ్లపాటు ఉద్యోగంతో పాటు ఈ ప్రాజెక్టుపై పని చేసిన తర్వాత పూర్తిస్థాయిలో వ్యాపారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
పెట్టుబడిదారుల సహాయం లేకుండానే వ్యాపారం
ప్రారంభంలో తన స్టార్టప్‌కు మద్దతు లభిస్తుందనే ఆశతో వై కాంబినేటర్ వంటి స్టార్టప్ ప్రోత్సాహక సంస్థలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంపిక కాలేదు. దీంతో ఇతరుల ఆమోదం కోసం ఎదురుచూడకుండా, మైక్రోసాఫ్ట్‌లో సంపాదించిన డబ్బునే తన వ్యాపారానికి ప్రారంభ పెట్టుబడిగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు.
ఉద్యోగం వదిలే ముందు కంపెనీ షేర్లలో తనకు రావాల్సిన వాటా పొందే సమయాన్ని, చేరిక సమయంలో ఇచ్చిన బోనస్‌లో కొంత తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా ఉండే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. 2024లో ఉద్యోగానికి రాజీనామా చేసి, అదే ఏడాది అక్టోబరులో ట్రెజరీని అధికారికంగా ప్రారంభించాడు.












