గ్రామ పంచాయతీల అభివృద్ధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన గుర్తింపు, గౌరవం, ప్రభుత్వపరమైన సదుపాయాలు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వార్డు సభ్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనగాం జిల్లా పరిపాలన అధికారికి ఫోరం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం కోశాధికారి చెప్యాల మహిపాల్ రెడ్డి, జనగాం జిల్లా ఇన్చార్జి గుండేటి రామచందర్ గౌడ్ లు వినతిపత్రంలోని పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వార్డు సభ్యులకు నెలకు రూ.3000 గౌరవ వేతనం మంజూరు చేయాలని, గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో అధికారిక విధులు నిర్వహించే సమయంలో అయ్యే ప్రయాణ ఖర్చులకు భత్యం కల్పించాలని వారు కోరారు.
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన లేదా గాయపడిన వార్డు సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వార్డు సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందించేలా ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలని ఫోరం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అలాగే, గ్రామసభలు, పంచాయతీ తీర్మానాలు, అభివృద్ధి పనుల ఎంపిక, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వార్డు సభ్యులకు పూర్తి భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
వార్డు సభ్యులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించి, పై డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని ఫోరం ప్రతినిధులు కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి చెప్యాల మహిపాల్ రెడ్డి, పాలకుర్తి, జనగాం, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల ఇంచార్జులు దొంతమల్ల గణేష్, గడ్డం శ్రీనివాస్, నాగబండి సంతోష్, జిల్లా ఫోరం ఆర్గనైజర్ ప్రేమ్ కుమార్, అన్ని మండలాల ఇంచార్జులు యాకన్న లక్ష్మీనారాయణ, మనోహర్ శ్రీనివాస్, అవినాష్ ప్రశాంత్, వినోద్ పవన్, శ్రీధర్ మహేందర్, శంకర్ హరి కృష్ణ, నిలమధు, ఆయగ్రమాల వార్డ్ సభ్యులు కృష్ణమూర్తి, విష్ణు, అరవింద్, పరమేష్, మణికంఠ, శ్రీనివాస్, సోమయ్య, శోభా, కోమలత, శంకర్, రవి, మల్లయ్యతో పాటు జనగాం జిల్లాలోని సుమారు 50 మంది వార్డు సభ్యులు పాల్గొన్నారు. వీరంతా వార్డు సభ్యుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.



