నర్మెట్ట, 9 September
తండాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు తండా డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సేవాలాల్ సేన నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తండాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.
తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి తండాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు తండా డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సేవాలాల్ సేన నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తండాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. మండలం మల్కపేట తండాలో బుధవారం సేవాలాల్ సేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ అధ్యక్షులు బానోత్ మోహన్ నాయక్ అధ్యక్షతన, మండల అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సేవాలాల్ సేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ మహేందర్ మాట్లాడుతూ.. బంజారా జాతి ఐక్యత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా 2015 సెప్టెంబరు 9న సరూర్నగర్ స్టేడియంలో సేవాలాల్ సేన ఆవిర్భవించిందని తెలిపారు. అప్పటి నుంచి తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం, సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం తదితర అంశాలపై సేన ఆధ్వర్యంలో పలు పోరాటాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సేవాలాల్ సేన యువజన జిల్లా అధ్యక్షులు తేజావత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ.. తండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తండాల్లో రోడ్లు, తాగునీరు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు తదితర మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరారు. బంజారా తండాలు, కాలనీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, వాటి అమలును పర్యవేక్షించేందుకు తండా డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బంజారా సమాజం తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా నిలవాలని నాయకులు పిలుపునిచ్చారు. భవిష్యత్లో చేపట్టే ఉద్యమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. యువత విద్య, ఉద్యోగ రంగాల్లో ముందుకు సాగడంతో పాటు బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, సేవాలాల్ మహారాజ్ ఆశయాలను భావితరాలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి బానోత్ అశోక్ నాయక్, మండల నాయకులు లాకావత్ రమణ, లక్ష్మణ్ నాయక్, బానోత్ బాల్సింగ్ నాయక్, లాకావత్ లాలు నాయక్, బానోత్ ప్రవీణ్ నాయక్, తేజావత్ తిరుపతి, పరశురాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.








