కుకునూరుపల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 24
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని గౌడ కుల దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో కార్తీక పూర్ణిమను పురస్కరించుకొని సామూహిక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గౌడ కుల సంఘ సభ్యులు, భక్తుల సహకారంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో సామూహికంగా దీపాలను వెలిగించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శివ పంతులు మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం దేవాలయాలను సందర్శిస్తూ తమ పిల్లలకు సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబొట్టు పద్ధతుల గురించి చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రస్తుతం సమాజంలో స్వదేశీ సంస్కృతిని పక్కనపెట్టి విదేశీ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారని అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల ప్రజలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ అనుసరిస్తుంటే, మన పిల్లలు మాత్రం విదేశీ సంస్కృతికి అలవాటు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు.
అలాగే సామూహికంగా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఐక్యతతో పాటు ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని, ఇలాంటి కార్యక్రమాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ కుల పెద్దలు, మహిళా విభాగం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణం కోసం ప్రార్థిస్తూ అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.



