ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొని పలు అంశాలపై రైతులకు వివరించారు.
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ సీనియర్ శాస్త్రవేత్త విజయ్ భాస్కర్, కూరగాయలలో వచ్చే చీడపీడలు, వాటి నివారణ మార్గాలపై రైతులకు అవగాహన కల్పించారు. టమాటా, వంగ, పచ్చిమిరప వంటి వివిధ రకాల కూరగాయల సాగులో ఎదురయ్యే సమస్యలపై ఆయన దృష్టి సారించారు.
శాస్త్రవేత్త డా. రాజు కుమార్, కూరగాయల రకాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, డ్రిప్, ఫెర్టిగేషన్ వాడకం, కలుపు నివారణ, కోత అనంతర జాగ్రత్తలపై సమగ్ర సమాచారం అందించారు.
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనసూయ, ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ రాయితీలు, ముఖ్యంగా డ్రిప్, ఆయిల్ పామ్ సాగులో ఇచ్చే సబ్సిడీల గురించి వివరించారు. డివిజన్ ఉద్యాన అధికారి సుస్మిత, నారు, మల్చింగ్, పవర్ స్ప్రేయర్ వంటి వాటిపై ఉన్న సబ్సిడీల వివరాలు తెలియజేశారు.
కార్యక్రమంలో భాగంగా టమాటా, గోరుచిక్కుడు తోటలను పరిశీలించారు. గ్రామ ఉపసర్పంచ్ అనిల్, అధికారుల సూచనలను పాటిస్తూ అధిక దిగుబడి సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఉద్యాన విస్తరణ అధికారి దేవరాజ్, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





