సిద్దిపేట నియోజకవర్గంలో 10 ఏళ్లు మంత్రిగా ఉండి అభివృద్ధిని గాలికి వదిలేసి, 59 జీవో పేరుతో దళితుల భూములను హరీష్ రావు, అతని అనుచరులు గుంజుకున్నది వాస్తవం కాదా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్టి సుధాకర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట ప్రజలు హరీష్ రావుకు గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చినా సిద్దిపేటలో సరైన రోడ్లు లేవని, సిద్దిపేట అభివృద్ధిని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. రైతులపై చిత్తశుద్ధితో నియోజకవర్గంలోని నర్మెట్ట గ్రామంలో సుమారు 300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని, అది నిజం కాదని ఆయన అన్నారు. అదేవిధంగా, నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టులు నిర్మించి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా, అంతగిరి ప్రాజెక్టు విషయంలో సిరిసిల్ల నియోజకవర్గం అంతగిరికి ఒకరకమైన పరిహారం, సిద్దిపేట నియోజకవర్గ అల్లిపూర్ రెవెన్యూ పరిసర ప్రాంతాల గ్రామాలకు మరో రకమైన పరిహారం ఇచ్చి మండల రైతులను మోసం చేశారని హరీష్ రావు అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి, కనీసం మిత్తి పైసలు కూడా పూర్తిగా మాఫీ చేయని దౌర్భాగ్య పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. పదేళ్లలో మీరు చేసిన అప్పులకు ఇప్పుడున్న ప్రభుత్వం నడవడమే కష్టంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం సుమారు 26 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశారని ఆయన అన్నారు. మండలంలో 28 గ్రామపంచాయతీలు ఉంటే, కేవలం 7, 8 గ్రామాలలో మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్న చరిత్ర హరీష్ రావుది అని ఆయన అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేని గ్రామాల్లో హరీష్ రావు ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు అడగదని, ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము హరీష్ రావుకు గానీ, అతని అనుచరులకు గానీ ఉందా అని ఆయన సవాల్ విసిరారు. బేషరతుగా హరీష్ రావు సిద్దిపేట ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన హితవు పలికారు.



