సందర్భంగా (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 15
సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పటేల్ పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో సభ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కార్యకర్తలకు సూచించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పటేల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో సభను విజయవంతం చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. ఈ మండలంలోని శ్రీరాములపల్లి, నకిరేకొమ్ముల, పరివేద గ్రామాలకు చెందిన గ్రామ అధ్యక్షులు, సర్పంచులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఆయా గ్రామాల మండల ఇన్చార్జులు భీమ్ రెడ్డి తిరుపతిరెడ్డి, దూలం శ్రీనివాస్ గౌడ్లతో కలిసి సభకు సంబంధించిన ఏర్పాట్లు, జన సమీకరణ, కార్యకర్తల భాగస్వామ్యంపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. గ్రామస్థాయిలో నాయకులు సమన్వయంతో పనిచేస్తూ సభకు ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పల్లె పల్లెకు పొన్నమన్న ప్రతి పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన సమయంలో వృద్ధులు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తించారని ఆయన తెలిపారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని హుస్నాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ప్రత్యేక వాహనాలను ఆలింకో సంస్థ సహకారంతో తన ప్రత్యేక చొరవతో అందించేందుకు మంత్రి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇందులో భాగంగా కోహెడ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు కూడా సహాయ ఉపకరణాలు అందించేలా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సర్పంచ్, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. తమ గ్రామాల్లోని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారిని కోహెడ మండలంలోని లక్ష్మీ గార్డెన్స్‌కు తీసుకువచ్చి పేర్ల నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని, ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని ఆయన అన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించడంలో గ్రామస్థాయి నాయకులు చొరవ చూపాలని, అధికారులకు అవసరమైన సహకారం అందిస్తూ శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.






