నర్మెట్ట, 14 November
రైతు బీమా నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, చనిపోయిన రైతులకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
రాష్ట్రంలో పంటలు ఎండిపోతుండటంతో చనిపోతున్న రైతులవి ఆత్మహత్యలు కావని, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని సర్పంచుల మండల అధ్యక్షుడు కంతి అంజనేయులు, తాజా మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఆగాపేట గ్రామంలో పత్తిపంట ఎండిపోయి దిగుబడి రాకపోవడంతో గడ్డిమందు తాగి ఇటీవల మెట్ల ఉప్పలమ్మ ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. దీంతో స్థానిక సర్పంచ్ డా. పగిడిపాటి రాజు విషయాన్ని జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన, స్థానిక బీఆర్ఎస్ నాయకులను పురమాయించి రైతు కుటుంబానికి ధైర్యం కల్పించాలని సూచించారు. దీంతో శనివారం బీఆర్ఎస్ మండల నాయకులు రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆగాపేటలో పంటలు సరిగా దిగుబడి రాక ఆత్మహత్య చేసుకున్న ఉప్పలమ్మ వయస్సు కేవలం 50 సంవత్సరాలు మాత్రమేనని, చిన్నతనంలో భర్తను కోల్పోయి తన కుటుంబాన్ని పోషిస్తుందని అన్నారు. పంటలు సరిగా పండక పోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. దీంతో వారి కుటుంబానికి రావాల్సిన రైతు బీమా రూ.5 లక్షలు రాకుండా పోయాయని అన్నారు. రైతు బీమా అమలులో ఉంటే పది రోజుల్లో వారి కుటుంబసభ్యుల ఖాతాల్లో రూ.5 లక్షలు జమ అయ్యేవని అన్నారు. రైతుబంధును సకాలంలో అందించకపోవడం, సరైన విద్యుత్ సరఫరా చేయకపోవడం, యూరియా, డీఏపీ రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఆగాపేట గ్రామానికి బొమ్మకూర్ ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అందించాలని డిమాండ్ చేశారు. కేవలం రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అన్ని వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. విత్తనాల పంపిణీ చేయకుండా, ఎరువుల పంపిణీలో, వడ్ల కొనుగోలులో ఇబ్బందులు పెడుతూ, విద్యుత్ సరఫరా చేయకుండా రైతులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల మాజీ మండల అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, సర్పంచులు భూక్య పద్మ రమేష్, అరుణ సంతోష్, బానోత్ మహేందర్, భూక్య రమేష్, పండుగ జ్యోతి రమేష్, పార్టీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి కంతి రాజలింగం, వార్డు సభ్యులు కందుల శ్వేత సుధాకర్, నక్క సుధాకర్, బుడ్డ భాస్కర్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మేడబోయిన రాజు, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు గౌరబోయిన సమ్మయ్య, పందిరి పరమేష్, బొడ్డు పరమేష్, ఎర్ర కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.


