పెద్దపహాడ్ జిల్లా పరిషత్ హైస్కూల్లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జనగామ జిల్లా ఆధ్వర్యంలో పెద్దపహాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో బాలికలకు సురక్షిత బచ్పన్ అభియాన్ (లైంగిక వేధింపుల నుండి పిల్లల రక్షణ చట్టం - పోక్సో)పై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జనగామ అడ్వకేట్ మంచాల రవీందర్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశానుసారం ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలలో ఈ అవగాహన సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం 18 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థిని, విద్యార్థులు వివాహం చేసుకోరాదని, శారీరక సంబంధాలు పెట్టుకోరాదని ఆయన గుర్తు చేశారు. ఈ పోక్సో చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని, ఇది చాలా పెద్ద నేరమని వివరించారు. తెలిసి చేసినా, తెలియక చేసినా నేరమేనని, శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
సమస్య వచ్చినప్పుడు తప్పకుండా స్నేహితులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. ఒకవేళ సమస్య ఇంట్లోనే లేదా స్కూల్లో ఉంటే, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు మీ సమస్యను తెలియజేయాలని కోరారు. మీకు పూర్తి రక్షణగా ఉంటారని తెలియజేశారు. ముఖ్యంగా, ఈ చట్టం 18 సంవత్సరాల లోపు ఉన్న వారిని రక్షించడానికి, బాధితులకు రక్షణ కల్పించడానికి, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించినదని వివరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం.రవీంద్ర గారు, జడ్పీహెచ్ స్కూల్ ఇంచార్జీ హెచ్ఎం పి.మల్లారెడ్డి గారు, పిఎల్విలు బి.శేఖర్, పి.జితేందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.












