ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ రాజకీయ పలుకుబడికి, ప్రభావశీల వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసిందని ఆమె ఆరోపించారు. ఫోన్ చేసి రుణాలు ఇప్పించుకునే రోజులు ముగిశాయని నిర్మల అన్నారు.
ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ రాజకీయ పలుకుబడికి, ప్రభావశీల వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసిందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పలుకుబడి ఉన్నవారికి ఫోన్‌బుక్ ఉండేది.. సామాన్య పౌరులకు మాత్రం రూల్‌బుక్ ఉండేది. ఫోన్ చేసి రుణాలు ఇప్పించుకునే రోజులు ముగిశాయి అని ఆమె వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పాలనలో బ్యాంకులపై రాజకీయ ఒత్తిళ్లు
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పాలనలో బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు పరిణామాలను ప్రస్తావించారు. 1957లో జరిగిన ముండ్రా కుంభకోణం, 1976లో ఎస్బీఐ ఛైర్మన్ ఆర్.కె. తల్వార్ తొలగింపు, 1980లలో బ్యాంకులపై వచ్చిన రాజకీయ ఒత్తిళ్లను ఆమె ఉదహరించారు. కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చేవారని ఆమె ఆరోపించారు. సంజయ్ గాంధీకి సంబంధించిన మారుతీ సంస్థకు రుణాల విషయంలోనూ ఒత్తిళ్లు వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే బి. జనార్ధన పూజారి, పవన్ కుమార్ బన్సాల్ వంటి నేతలపై కూడా ఆమె విమర్శలు చేశారు.











