చెరియాల్, 2026-11-24
అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 14 నెలల చిన్నారి దార్శిక రెడ్డి చికిత్సకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అండగా నిలిచారు. చేర్యాల పట్టణానికి చెందిన కారు డ్రైవర్ పుర్మ రాజశేఖర్ రెడ్డి కుమార్తె దార్శిక రెడ్డి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి చికిత్సకు సుమారు రూ.9 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంజెక్షన్ అందేలోపు ప్రతినెలా రూ.12,500 విలువైన రిస్డిప్లామ్ మందులు వాడాల్సి ఉంది.
విషయం తెలుసుకున్న నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తొలి నెల మందుల ఖర్చు రూ.12,500 అందజేశారు. ఈ సందర్భంగా నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని కోరారు.
చిన్నారి పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.



