దుబ్బాక, సిద్దిపేట, తెలంగాణ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
దుబ్బాక నియోజకవర్గంలోని రహదారుల అధ్వాన పరిస్థితిపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ఆర్అండ్బీ రహదారులు అధ్వానంగా మారినందున ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్ల మరమ్మతులు, నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రజల కష్టాలు తొలగించాలని ఆయన కోరారు. ఈ మేరకు మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసి, నియోజకవర్గంలోని రహదారుల సమస్యలను వివరిస్తూ లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. తొగుట, భూంపల్లి, దుబ్బాక మండలాల్లో హై లెవల్ బ్రిడ్జిల () నిర్మాణంతో పాటు మొండి చింతబేగంపేట రోడ్డు, భూంపల్లిదొమ్మాట రోడ్డు, హబ్సిపూర్దుబ్బాక రోడ్డు, దుబ్బాకమెదక్సిద్దిపేట రహదారి, మెట్టుదౌల్తాబాద్ రోడ్డు వంటి మార్గాల పునరుద్ధరణ, రెన్యువల్ పనులకు నిధులు మంజూరు చేయాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.
నియోజకవర్గంలో కొత్త రహదారుల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం సుమారు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు దెబ్బతినడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, ఆ పనులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రహదారుల అభివృద్ధికి సంబంధించిన అంశాలను పరిశీలించి, నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.



