జనగామ, 19 November
పట్టభద్రుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శాసనమండలిలో వారి గొంతుకగా నిలబడతానని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే నిరుద్యోగ యువత, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఆనంతుల ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి పట్టభద్రులు, యువకులు, వివిధ సంఘాల నాయకులు భారీగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. తాను బీసీ బిడ్డనని, సామాన్య కుటుంబాల కష్టాలు, పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగ యువత ఇబ్బందులు తనకు తెలుసని అన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, పట్టభద్రులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో గళమెత్తుతానని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. పట్టభద్రులు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఆలోచించి వినియోగించుకోవాలని ఆయన కోరారు. సమావేశానికి హాజరైన పట్టభద్రులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.



