అరుదైన వ్యాధితో బాధపడుతున్న జనగామ జిల్లా పోచన్నపేట గ్రామానికి చెందిన సంగమల్ల ప్రేమానంద్ అనే యువకుడికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అండగా నిలిచి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2,50,000 ఎల్వోసీని అందజేశారు.
జనగామ నియోజకవర్గం, బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన సంగమల్ల ప్రేమానంద్ అనే యువకుడు గత కొంతకాలంగా కాళ్లలో బ్లడ్ క్లాటింగ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అత్యంత ఖరీదైన ఇంజక్షన్లు అవసరమైన ఈ వ్యాధికి, పేద కుటుంబం కావడంతో చికిత్స అందించడం కష్టతరంగా మారింది.
ఈ విషయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి వెళ్లడంతో, ఆయన తక్షణమే స్పందించారు. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000 ఎల్వోసీని మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.
ఎల్వోసీ పత్రాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేసిన సందర్భంగా, కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య సంరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. ప్రేమానంద్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
సాయం అందిన నేపథ్యంలో, బాధితుడి కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు, నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ కు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు.




