స్టేషన్గన్పూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు ధరావత్ రాజుకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించిన సందర్భంగా పాఠశాలలో ఘన సన్మానం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజును ఘనంగా సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ధరావత్ రాజును ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ధరావత్ రాజుగారు గత 32 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖలోని వివిధ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతూ, వారి ఎదుగుదలకు మహోన్నత కృషి చేశారని కొనియాడారు. అటవీ ప్రాంతంలో సరైన రహదారి, రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో మారుమూల పల్లెలకు వెళ్లి, కేవలం చదువులోనే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని గిరిజనులను చైతన్యవంతం చేయడంలో విశేష కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దశరథ్, సుమలత, వాసు, సమ్మక్క, మాన్య, పార్వతి బాయ్, మల్లు, బాలాజీ, సుజాత, సాంబయ్య, కల్పన, సునీత, స్వర్ణ, అనిత తదితరులు పాల్గొన్నారు.












