వర్షాలకు దెబ్బతిన్న విగ్రహం స్థానంలో నూతన నిర్మాణం
మండలంలోని జాలపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం పునర్నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చెట్కూరి కమలాకర్ యాదవ్ గ్రామస్తులతో కలిసి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు గాంధీ విగ్రహం సమీపంలోని రావి చెట్టు కూలి విగ్రహంపై పడటంతో అది పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. దీంతో గ్రామస్తుల సహకారంతో అదే ప్రాంతంలో నూతనంగా గాంధీ విగ్రహాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించి భూమిపూజ చేసినట్లు పేర్కొన్నారు. గాంధీ విగ్రహం పునర్నిర్మాణానికి గ్రామస్తులు సహకరించడం అభినందనీయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, ఉపసర్పంచ్ పరశురాం గౌడ్, ఏపీవో, ప్రధానోపాధ్యాయుడు, పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచులు, పీఏసీఎస్ డైరెక్టర్, ఉపాధ్యాయులు, గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











