రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మొక్కజొన్న, ధాన్యం పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం, మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే అన్ని ప్రైవేట్ గోదాములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, నిల్వ సదుపాయాలను పెంచాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన పూర్తి చేసి, రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ, ఈ యాసంగి సీజన్లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించిందని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 25 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల కోసం ఇప్పటివరకు రూ. 3,873 కోట్లను విడుదల చేసినట్లు, 18 కోట్ల 68 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, భారీగా మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మొక్కజొన్న తెలంగాణలోకి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాబోయే ఒక నెల అత్యంత కీలకమని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగి, ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట్ర మంత్రివర్గం రూ. 4,178 కోట్లను ఆమోదించిందని తెలిపారు. అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, హమాలీ చార్జీలను ఒక్కో సంచికి రూ. 8.50కు పెంచినట్లు చెప్పారు. ఈ వీసీ తదనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.








