తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' పేరుతో రానున్న 99 రోజుల కార్యాచరణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 4న కలెక్టర్ల సమావేశంలో సమీక్ష ఉంటుందని, ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, ఆన్లైన్ సేవలు, సంక్షేమ పథకాల పకడ్బందీ అమలు వంటి అంశాలపై సీఎం దృష్టి సారించారు.
సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి, కోర్ అర్బన్ రీజియన్‌లో మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని విస్తరించాలని, పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని సూచించారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు తెలిపారు.
శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని, ప్రతి శాఖకూ సొంత భవనం ఉండాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై దృష్టి సారించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సర్వీస్ సెక్టార్‌ను ప్రక్షాళన చేసి, అన్ని పనులూ ఆన్లైన్ విధానంలో జరిగేలా చూడాలని, నిర్ణీత సమయంలో ఫైళ్లు క్లియర్ కావాలని సీఎం స్పష్టం చేశారు. పాత సర్వర్లను అప్డేట్ చేసుకోవాలని, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయడంలో సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
డిజిటల్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలని, నాణ్యమైన విద్యను అందించడంపై సారించాలని సీఎం సూచించారు. వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించబోతున్నామని, ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే 99 రోజుల ప్రణాళికలో ప్రతి అధికారి పాల్గొనాలని ఆదేశించారు.







