స్టేషన్ ఘన్పూర్ లో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ఏం చేశారని మాజీ ఎమ్మెల్యే రాజయ్యను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. పాఠశాలలకు కనీసం పక్కా భవనాలు కూడా నిర్మించలేని వారు ఇప్పుడు అభివృద్ధిపై విమర్శలు చేయడం విడ్డూరమని మండిపడ్డారు.
విద్యారంగానికి ప్రాధాన్యత
తాను విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నానని, 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి సుమారు రూ.300 కోట్లతో పనులు మంజూరు చేయించి అమలు చేస్తున్నామని తెలిపారు. 45 కోట్లతో చిల్పూర్లో టాటా సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, నారాయణగిరిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, స్టేషన్ ఘన్పూర్లో రూ.6.10 కోట్లతో డిగ్రీ కళాశాల భవనం, కేజీబీవీలకు రూ.6 కోట్లు, లింగాలఘణపురం హాస్టల్కు రూ.1.50 కోట్లు, పలు పాఠశాలల ప్రహరీ గోడలకు రూ.10 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రతి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
బీఆర్ఎస్ పై విమర్శలు
బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది, కూలింది బీఆర్ఎస్ హయాంలోనేనని ధ్వజమెత్తారు. హరీష్ రావుకు కేసీఆర్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని, కేటీఆర్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉనికిని చాటుకునేందుకే హరీష్ రావు రోజుకో మీడియా సమావేశం పెడుతున్నారని విమర్శించారు.
పాల్గొన్న నాయకులు
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బెలిదే వెంకన్న, స్టేషన్ ఘన్పూర్, రఘునాథపల్లి మండలాల అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, గాద మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు, టౌన్ అధికార ప్రతినిధి పోశాల కృష్ణ, సీనియర్ నాయకులు బూర్ల శంకర్, భూక్య స్వామి నాయక్, గన్ను నరసింహులు, రాఘవరెడ్డి, తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ సంపత్ రాజు, తదితరులు పాల్గొన్నారు.


