తరిగొప్పుల, ఓరుగల్లు, 2026-11-20
ఓరుగల్లు న్యూస్ మండల రిపోర్టర్ మెర్గజు సుధాకర్
మండలంలోని వాచ్యాతండా గ్రామపంచాయతీ పరిధిలో మహిళా సంఘం భవన నిర్మాణానికి సంబంధించి శుక్రవారం సర్పంచ్ గుగులోతు లలిత రాజు నాయక్ ఆధ్వర్యంలో స్థలాన్ని మార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లలిత రాజు నాయక్ మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సంఘ కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించడానికి సొంత భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామంలో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. భవన నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి నవనీత, ఉపసర్పంచ్, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.


