విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై రాజకీయ వ్యక్తులు చేసిన దాడులను నోబుల్ ఉపాధ్యాయుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు ప్రభుత్వాన్ని కోరారు.
రాయచోటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడారు. రాజకీయ ముసుగులో ఉపాధ్యాయులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ ముసుగులో వారు ప్రవర్తించిన తీరు, ఉపాధ్యాయులపై చేసిన ఆరోపణలు, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన తీరు చాలా బాధాకరమని శ్రీనివాసరాజు అన్నారు. గత రెండు నెలలుగా వారు చేసిన ఆరోపణలకు అధికారులు పూర్తి సమాచారాన్ని ఇచ్చినప్పటికీ, ఇలా ప్రవర్తించడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
నోబుల్ ఉపాధ్యాయుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నల్లమల రామాంజులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో కొన్ని మార్పులు చేసి, ఉపాధ్యాయులపై దాడి చేసిన వారికి కఠిన శిక్షలు అమలు అయ్యే విధంగా చట్టాలలో మార్పులు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పకీర, నాగరాజు, పీరయ్య, రామ నాయుడు, రాజేంద్ర నాయుడు, రెడ్డయ్య రాజు, మధుసూదన రెడ్డి, రమేష్ రాజు, వెంకటరామరాజు, రాచయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

