జనగామ జిల్లా, తరిగొప్పుల మండలంలోని KGBV పాఠశాలకు ఇన్ఫోసిస్ సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్లు విరాళంగా అందాయి. ఈ విరాళం గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు వారి విద్యాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఇన్ఫోసిస్ సంస్థ మేనేజర్ శ్రీమతి రాపాక స్వాతి, CSR కోఆర్డినేటర్ శ్రీ రాపాక నాగరాజు గార్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సునీత మేడం గారి సమక్షంలో కంప్యూటర్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి కంప్యూటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
పట్టణ విద్యార్థులతో సమానంగా గ్రామీణ విద్యార్థులు కూడా అన్ని రంగాలలో రాణించాలంటే వారికి సాంకేతిక విద్య తప్పనిసరి అని, ముఖ్యంగా బాలికలు, మహిళలు కంప్యూటర్ పరిజ్ఞానంతో ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ సుధా మూర్తి గారి ఆశయం మేరకు ఈ విరాళం అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు ఈ కంప్యూటర్లను సద్వినియోగం చేసుకొని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో GCDO గౌసియా మేడం, పాఠశాల ఉపాధ్యాయులు ఉపేంద్ర, కవిత, సంధ్యారాణి, సరస్వతి, ఉషారాణి, స్వరూప మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.








