21 నవంబర్ 26 ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 21
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ సేవలను గుర్తించి, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమని టీపీసీసీ కార్యదర్శి, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి విశేష సేవలందించిన మహనీయుడికి ఈ నిర్ణయం ద్వారా సముచిత గౌరవం లభించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు అనంతుల మదన్ మోహన్ పేరును సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు పెడుతున్నట్లు ప్రకటించడం పట్ల యాదగిరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తొలి దశ ఉద్యమంలోనే బలంగా వినిపించిన నాయకుల్లో అనంతుల మదన్ మోహన్ ఒకరని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం, రాజకీయ సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. పదవులు, అధికారాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసిన నాయకుల సేవలను భావితరాలకు పరిచయం చేయడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టాలనే నిర్ణయం ఆయన ఆశయాలను, ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు గుర్తుచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్న అనంతుల మదన్ మోహన్ సేవలను గుర్తించి గౌరవించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.


