శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసేందుకు వచ్చిన తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.21 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కోయంబత్తూరుకు చెందిన పార్వతి, తూత్తుకుడికి చెందిన గీత అనే మహిళలు కోళంచేరి నుంచి రాన్నికి ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయంలో బస్సులో దుస్తులు మార్చుకుంటున్న వీరిని గమనించిన బస్సు సిబ్బందికి అనుమానం కలిగింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు రాన్ని పోలీస్ స్టేషన్ వద్ద బస్సును ఆపి, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసుల సహాయంతో తనిఖీలు నిర్వహించగా, ఒకరి లోదుస్తుల్లో దాచిన రూ.21 వేల నగదును గుర్తించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు వారి వివరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో, వీరిద్దరూ వివిధ ప్రాంతాల్లో నమోదైన సుమారు పది దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శబరిమల యాత్రికుల రద్దీని ఆసరాగా చేసుకుని, వారి వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువులను దొంగిలించేందుకు వీరు ఇక్కడికి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.


