రైలులో టీటీఈగా నటిస్తూ ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులను నిద్రలేపి టికెట్లు చూపాలని కోరడంతో అనుమానం వచ్చిన ఓ ప్రయాణికుడు ఆమెను గుర్తింపు కార్డు చూపించాలని ప్రశ్నించాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
మహారాష్ట్ర నుంచి బిహార్‌కు వెళ్తున్న రైలులో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మహిళ టీటీఈగా పరిచయం చేసుకుంటూ బోగీలోని ప్రయాణికులను నిద్రలేపి టికెట్లు చూపాలని కోరింది. టికెట్ లేని ఓ ప్రయాణికుడికి టికెట్ ఇస్తానంటూ అతడి పేరు అడిగి తన బ్యాగులో నుంచి తెల్ల కాగితం తీసి దానిపై రాయడం ప్రారంభించింది.
ఐడీ కార్డు అడగడంతో అనుమానం
ఆమె యూనిఫామ్ ధరించకపోవడం, అధికారిక గుర్తింపు కార్డు చూపించకపోవడంతో ఒక ప్రయాణికుడికి అనుమానం వచ్చింది. వెంటనే ఆమె ఐడీ కార్డు చూపించాలని కోరాడు. అయితే తన గుర్తింపు కార్డును ప్రయాణికులకు చూపించాల్సిన అవసరం లేదని ఆమె సమాధానమిచ్చినట్లు తెలిసింది.
దీంతో ప్రయాణికులు మరిన్ని ప్రశ్నలు వేయడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రయాణికులపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆరోపించినట్లు వైరల్ వీడియోకు సంబంధించిన కథనాలు వెల్లడించాయి. అనంతరం మాస్క్ ధరించి జనంలో కలిసిపోయినట్లు సమాచారం.
రైల్వే శాఖ స్పందన
ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ మహిళ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన రైల్వే శాఖ సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ మహిళ వివరాలు, ఆమె వసూలు చేసిన డబ్బులపై ఇంకా స్పష్టత రాలేదు.
రైలులో టికెట్ తనిఖీ చేసే వ్యక్తుల గుర్తింపుపై అనుమానం వస్తే అధికారిక గుర్తింపు కార్డు అడగాలని, అవసరమైతే రైల్వే హెల్ప్‌లైన్ 139ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు.











