సిద్దిపేట (అర్బన్), 2026-11-26
ఎమ్మెల్యే హరీశ్‌రావు, గ్రంథాలయ చైర్మన్ కు అవమానం.. ప్రణాళిక లోపాలతో విద్యార్థులకు ప్రయోజనాలు అందడం లేదని ఆరోపణలు
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిలో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు నిర్వహించే రాష్ట్రస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన వివాదాలు, విమర్శల మధ్య ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రాంగణం (మెరిడియన్ హైస్కూల్)లో 54వ రాష్ట్రస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ప్రదర్శన నిర్వహణకు వేదిక ఎంపిక నుంచి ఆహ్వానాలు, ప్రోటోకాల్, ఏర్పాట్ల వరకు పలు అంశాలు వివాదాస్పదంగా మారాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడంతో కార్యక్రమంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.
గత పదేళ్లుగా సిద్దిపేట పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రదర్శనలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విజ్ఞాన ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థుల ఆవిష్కరణలను తిలకించేవారు. మూడు రోజులపాటు పట్టణంలో వైజ్ఞానిక సందడి నెలకొనేది. అయితే ఈసారి నవోదయ ప్రవేశ పరీక్ష కారణంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహణ సాధ్యం కాదనే కారణంతో పట్టణానికి దూరంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలకు వేదికను మార్చడం విమర్శలకు తావిచ్చింది. ప్రత్యామ్నాయ తేదీల్లో నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ప్రైవేట్ పాఠశాలను ఎంపిక చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేను గౌరవప్రదంగా ఆహ్వానించడం సంప్రదాయం. అయితే సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానం పంపలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో మరో కార్యక్రమానికి వెళ్తున్న హరీశ్‌రావు సైన్స్ ఫెయిర్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత అలంకరణను చూసి ప్రదర్శన ప్రాంగణంలోకి వెళ్లారు. అక్కడి అధికారులు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు జ్యోతి ప్రజ్వలనకు ప్రయత్నించి, అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. కొన్ని వైజ్ఞానిక నమూనాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అనంతరం తనకు ముందస్తుగా ఆహ్వానం అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారుల తీరును ప్రశ్నించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం విషయంలోనూ ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. కార్యక్రమానికి హాజరై వేదిక ముందు కూర్చున్న ఆయనను ప్రారంభోత్సవ సమయంలో వేదికపైకి ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత ఆహ్వానించినప్పటికీ, వేదిక ముందు కార్యక్రమం పూర్తవడంతో ఆయన మాట్లాడకుండా తన నిరసనను తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపించాయి.
పట్టణానికి దూరంగా ప్రైవేట్ పాఠశాలలో ప్రదర్శన నిర్వహించడం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం ప్రశ్నార్థకంగా మారింది. రవాణా సౌకర్యాలు, సమయం, ఖర్చుల కారణంగా అనేక పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనను సందర్శించే అవకాశం పరిమితం కానుంది. గతంలో పట్టణం నడిబొడ్డున నిర్వహించినప్పుడు సామాన్య ప్రజలు సైతం కుటుంబ సమేతంగా వచ్చి విద్యార్థుల ఆవిష్కరణలను చూసేవారు. ఈసారి వేదిక దూరంగా ఉండటంతో సైన్స్ ఫెయిర్ ఆశించిన స్థాయిలో విద్యార్థులకు చేరువ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ప్రదర్శన షెడ్యూల్ విడుదలలోనూ సమన్వయ లోపాలు కనిపించాయని విమర్శలు వెల్లువెత్తాయి.


