బీజేపీ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 23
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ఇండియా కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ నెల 25న సిద్దిపేటలో బీజేపీ భారీ మహా పాదయాత్ర నిర్వహిస్తోంది. ఈ పాదయాత్రకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం మీడియా సమావేశంలో ప్రకటించారు.
అబద్ధపు పునాదులపై అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ఇండియా కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ నెల 25న సిద్దిపేట పట్టణంలో భారీ మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం సిద్దిపేటలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహా పాదయాత్రకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. కేంద్ర మంత్రి ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సిద్దిపేట కలెక్టరేట్‌కు చేరుకుంటారని తెలిపారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి విక్టరీ చౌరస్తా మీదుగా మహా పాదయాత్ర ప్రారంభమై, సాయంత్రం 4 గంటలకు పాత బస్టాండ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మరణించిన వారి పేర్లు, నకిలీ ఓటర్లు, ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల నమోదైనట్లయితే అటువంటి లోపాలను సరిచేసి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యమని ఎంపీ తెలిపారు. అయితే, ఇండియా కూటమి నాయకులు ఈ ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలను వివరించడంతో పాటు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే మహా పాదయాత్ర చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహా పాదయాత్ర నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విక్టరీ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని ఆయన తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి పోలీసులకు, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, విభీషణ్ రెడ్డి, బాసంగారి వెంకట్, కాసనిగొట్టు సంతోష్, కొత్తపల్లి వేణుగోపాల్, గోనె మార్కండేయులు, తాటికొండ శ్రీనివాస్, బొడ్డు సునీల్, సాయి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


