తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్లో సుమారు 25 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఈవీ కంపెనీల ప్రతినిధులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాలకు పెట్టుబడుల అవకాశాలను పెంచడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే కొనసాగుతున్న పరిశ్రమల విస్తరణ ప్రణాళికలు, కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు, భవిష్యత్తులో చేపట్టగల ప్రాజెక్టులపై కంపెనీల ప్రతినిధులతో మంత్రి చర్చించనున్నారు.
ఈ సమావేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, క్లీన్ మొబిలిటీ, రవాణా రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పరిశ్రమల అవసరాలు, ప్రభుత్వ విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులపై ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరించనున్నారు.
ఈవీ రంగంలో పెట్టుబడులు పెరిగితే వాహనాల తయారీతో పాటు బ్యాటరీ ఉత్పత్తి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, అనుబంధ పరిశ్రమల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

