కేంద్ర ప్రభుత్వం స్టాండ్అప్ ఇండియా పథకాన్ని 2031 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద మరో 25 లక్షల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.4,111 కోట్ల నిధిని కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ముఖ్యంగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ పథకం ద్వారా రుణ సదుపాయం కల్పించనుంది. తయారీ, సేవలు, వాణిజ్య రంగాలతో పాటు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లోనూ వ్యాపారాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించనుంది. బ్యాంకుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. కొత్త నిధుల కేటాయింపుతో చిన్న వ్యాపారాల స్థాపనకు ఊతం లభించడంతో పాటు మహిళలు, అణగారిన వర్గాల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందని కేంద్రం భావిస్తోంది.

