కేంద్ర ప్రభుత్వం లిథియం-అయాన్ బ్యాటరీల వ్యర్థాల ఎగుమతులపై కీలక నిషేధం విధించింది. లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ లేని క్రమబద్ధీకరించని బ్యాటరీ వ్యర్థాలు, స్క్రాప్‌తో పాటు లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి లభించే బ్లాక్ మాస్ ఎగుమతులను తక్షణమే నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు అనుమతించిన ఈ ఎగుమతులను ఫ్రీ కేటగిరీ నుంచి ప్రొహిబిటెడ్ కేటగిరీకి మార్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. వాడేసిన బ్యాటరీల నుంచి లభించే లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన ఖనిజాలను దేశీయంగానే రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకోవడం, కీలక ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.

