పెద్దపల్లి జిల్లా మంథని, 2026-11-25
మంథని: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నింపింది.
మంథని: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నింపింది. మంథని మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మవాడకు చెందిన నాయిని భవాని, రాజు, నాయిని మల్లమ్మ, వడ్లవాడకు చెందిన మల్లోజు సునీత, నాగరాజు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన మంత్రి, నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో ముచ్చటిస్తూ సొంతింటి కల నెరవేరిన ఆనందంలో భాగస్వాములయ్యారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆప్యాయంగా పలకరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన తమ కల నెరవేరడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వానికి, మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు శివ, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు, న్యాయవాది శశిభూషణ్ కాచే, ఇనుముల సత్యనారాయణ, సోషల్ మీడియా ఇన్చార్జి ఆరేళ్లి కిరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


