ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం మరియు ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, కోటి రూపాయల బీమా పరిహారం అందజేస్తామని మంత్రి తెలిపారు.
ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ప్రవళిక తల్లిని పరామర్శించి, వారికి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం మరియు ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి కోటి రూపాయల ప్రమాద బీమా అందజేస్తామని తెలిపారు.
ఆర్టీసీ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే మేనేజ్మెంట్ తరఫున ఆసుపత్రికి వెళ్లి, మంచి చికిత్స అందించే ప్రయత్నం చేశామని, కానీ దురదృష్టవశాత్తూ కండక్టర్ ప్రవళిక దూరమైందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి మంచి చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు కార్మికుల సంక్షేమం, భద్రత కూడా ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి అంశాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. ఈ సంఘటనలో దోషిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, తగిన విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని, ఒకవేళ మా సిబ్బంది ఎక్కడైనా పొరపాటుగా ప్రవర్తిస్తే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ నేరుగా మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వల్ల ఈరోజు ఒక కుటుంబం రోడ్డున పడిందని అన్నారు.
ఆ కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుందని, వారి తల్లికి ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం తరఫున, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షలు ఇవ్వడంతో పాటు, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం వారి కుటుంబానికి బ్యాంక్ ద్వారా కోటి రూపాయల బీమా పరిహారం అందుతుందని మంత్రి వివరించారు. ఆర్థికంగా ఇబ్బంది లేకున్నా, సభ్యురాలిని కోల్పోయిన బాధ నుంచి ఎవరూ తేలేరని అన్నారు.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రజాపాలన ప్రభుత్వం, కార్మికుల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. కార్మికుల్లో ఎక్కడా అసహనం లేకుండా, వారి పట్ల పెండింగ్లో ఉన్న అన్ని నిర్ణయాలు తీసుకున్నామని, వారంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. తాను కూడా ఆసుపత్రికి వెళ్లి అమ్మాయికి ధైర్యం చెప్పానని, ఆ కుటుంబానికి పూర్తి బాధ్యతతో అండగా ఉంటామని చెప్పామని తెలిపారు.
ప్రయాణికులకు సౌకర్యం కల్పించే బాధ్యత ఆర్టీసీది. ఏదైనా ఇబ్బంది ఉంటే, మా సిబ్బంది పొరపాటున ప్రవర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చు, చర్యలు తీసుకుంటాం. ఇలాంటి దాడులు సరికాదని మంత్రి అన్నారు. క్రమశిక్షణతో కూడిన కాకీ యూనిఫాంలో ఆర్టీసీ ముందుకు వస్తుందని, క్రమశిక్షణ పాటించాలని మా సిబ్బందిని కోరుతానని తెలిపారు. ప్రయాణికులే దేవుళ్ళు, కస్టమరే దేవుడు అన్నట్లుగా వారికి సౌకర్యం కల్పించడం మన బాధ్యత అని చెప్పారు. ప్రయాణికుల వల్ల ఏమైనా అసౌకర్యం కలిగితే, చట్ట ప్రకారం ఫిర్యాదు చేద్దామని సూచించారు.




