పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మండలంలోని అమ్మపురం గ్రామంలో శుక్రవారం అడిషనల్ డీఆర్డీఓ, ఎంపీడీఓ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోలగాని రేఖ బాపురాజు గౌడ్ మాట్లాడుతూ, కుటుంబంలో అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కుటుంబ జీవిత బీమా పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులందరికీ పథకం ప్రయోజనాలు అందేలా గ్రామపంచాయతీ తరఫున కృషి చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అందించడం ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, గ్రామ ప్రజలకు సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


