తరిగొప్పుల, 19 November
ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ ని విస్మరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని,కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి
ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం తగిన గౌరవం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులపై కూడా ఉందని ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హోదాను అగౌరవపరిచేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం సమంజసం కాదని ఆయన విమర్శించారు.
అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రజాస్వామ్య విలువలను, ప్రోటోకాల్ నిబంధనలను విస్మరించకూడదని ఆయన హితవు పలికారు. రాజకీయ విభేదాలు ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడుకోవాలే తప్ప, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో వివాదాలకు తావివ్వడం తగదని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధుల పదవులు, హోదాలకు అనుగుణంగా గౌరవం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో కనీస బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించే చర్యలను బీఆర్ఎస్ పార్టీ సహించబోదని ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.


