కొమురవెల్లి క్షేత్రం, కొమురవెల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 15
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద భక్తుల రాకపోకలతో పండుగ వాతావరణం కనిపించింది.
కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాల్లోని రహదారులు, వ్యాపార సముదాయాలు కిక్కిరిసిపోయాయి. కొమురవెల్లి క్షేత్రం భక్తులతో కళకళలాడుతూ జనజాతరను తలపిస్తోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
కొమురవెల్లి క్షేత్రంలో ఎటు చూసినా భక్తుల సందడే నెలకొంది. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.






