ఆగపేట గ్రామానికి చెందిన మెట్ల ఉప్పలమ్మ (50) పత్తి పంటకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై, గడ్డి మందు తాగి జనగామలోని ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో, డాక్టర్ల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 8:33 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న ఆగపేట గ్రామ సర్పంచ్ డాక్టర్ పగిడిపాటి రాజు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పోస్టుమార్టం ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించారు.
అనంతరం, కుటుంబ సభ్యుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌరబోయిన కుమార్, బోయిని సురేష్, గౌరబోయిన రాజ్ కుమార్, ఎర్రబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలిచిన సర్పంచ్ డాక్టర్ పగిడిపాటి రాజును అభినందించారు.

