సిద్దిపేట, 12 November
జిల్లాలోని రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌ను మల్టీ జోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) చంద్రశేఖర్ రెడ్డి గురువారం సందర్శించి, సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఆయనకు స్వాగతం పలికారు. స్టేషన్ సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా మల్టీ జోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) చంద్రశేఖర్ రెడ్డి గురువారం జిల్లాలోని రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఐజీకి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఐజీ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. తదుపరి, పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమైన ఐజీ వారి విధి నిర్వహణ, వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, నమోదవుతున్న కేసులు, నేరాల స్వరూపంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ గతంతో పోలిస్తే పోలీసు విధుల్లో అనేక మార్పులు వచ్చాయని, అదే సమయంలో నేరాల తీరు కూడా మారుతోందని అన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వివిధ రకాల నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, విధుల పట్ల నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని ఆదేశించారు. పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. విధుల్లో ఉన్నా, వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లినా ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు.
అనంతరం, పోలీస్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఉన్న నేరాలకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేశారు. రిసెప్షన్ విభాగం పనితీరు, ఏటా స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదుల వివరాలను సమీక్షించారు. స్టేషన్ రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తు, ట్రయల్ దశలో ఉన్న కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన ఎస్ఓపీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. ఈ తనిఖీల్లో పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఏసీపీ రవీందర్ రెడ్డి, రూరల్ సీఐ విద్యాసాగర్, ఇన్స్పెక్టర్లు కిరణ్, లతీఫ్, రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్, చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


