మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని శుక్రవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ కలిసి పరిశీలించారు.
సభా ప్రాంగణం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ, మంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, భద్రతా చర్యల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మాట్లాడుతూ, మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు మున్సిపాలిటీ తరఫున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. సభా ప్రాంగణంలో పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.











