జనగామ, 10 November
పంట నష్ట పరిహారం తక్షణమే అందించాలి, 200 రోజుల ఉపాధి హామీ కల్పించాలి
ఎల్నినో ప్రభావం, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, తక్షణమే పంట నష్ట పరిహారం అందించాలని జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జనగామలోని జిల్లా కార్యాలయంలో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటలు దెబ్బతినడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు, పాత రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు.
జనగామ, స్టేషన్ ఘన్పూర్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 200 రోజుల ఉపాధి హామీ పని కల్పించాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గత జూలై నుంచే చెరువులు, కుంటలను నింపి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని, ప్రభుత్వ తీరును విమర్శించారు. జిల్లాలో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను దోచుకుంటున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పనితీరుపై కూడా కనకారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించకుండా, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అర్హులైన పేదలకు న్యాయం చేయాలని, గతంలో డ్రా ద్వారా ఎంపికైన 72 కుటుంబాలకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీ తర్వాత దశలవారీగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నెల రోజుల పాటు సర్వే నిర్వహించి, ప్రజా సమస్యలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బోడ నరేందర్, పోత్కనూరి ఉపేందర్, బి. గణేష్, పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం, కచ్చగళ్ల వెంకటేష్, బాధితులు శోభ, బూడిది అంజమ్మ, రాజమణి, కవిత, పాలమాకుల మంజుల, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.






