హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఆదర్శ కుటుంబం. కుటుంబ భావోద్వేగాలకు యాక్షన్, క్రైమ్ మిస్టరీ అంశాలను జోడించి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథలో మొదటి భాగం ఆకట్టుకున్నా, రెండో భాగం ఊహించదగిన మలుపులతో సాగింది.
కథేంటంటే చిట్టిబాబు (వెంకటేష్) ఓ సాధారణ మధ్యతరగతి ప్రైవేట్ ఉద్యోగి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్‌ఫండ్స్ వ్యాపారంలో నష్టపోయి కుటుంబాన్ని అప్పులపాలు చేస్తుంది. కొడుకు సర్వ (ప్రజ్వల్) గుండెలో రంధ్రంతో బాధపడుతుంటాడు. కూతురు సంపూర్ణ (యువీనా) కాలేజీలో చదువుకుంటూ ఓ మెకానిక్‌తో ప్రేమలో ఉంటుంది.
ఇలా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న చిట్టిబాబుకు అనూహ్యంగా రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. దీంతో అద్దె ఇంట్లో ఉంటున్న ఆ కుటుంబం ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాకు మారుతుంది. లగ్జరీ కారును కూడా కొనుగోలు చేస్తుంది. అయితే ధనవంతుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడే బీహార్‌కు చెందిన ఓ ముఠా చిట్టిబాబు కుటుంబంపై కన్నేస్తుంది. ఆ ముఠా నుంచి తన కుటుంబాన్ని చిట్టిబాబు ఎలా కాపాడుకున్నాడు పోలీస్ అధికారి దామోదర్ నాయుడు (నారా రోహిత్) ఈ వ్యవహారంలో ఎలా సహాయపడ్డాడు డీఎస్పీ బృహస్పతి రావు (రావు రమేష్) పాత్ర ఏమిటి అన్నదే మిగతా కథ.
సినిమా ఎలా ఉంది
త్రివిక్రమ్ సినిమాలంటే కుటుంబ వినోదం, చమత్కారమైన సంభాషణలు గుర్తుకొస్తాయి. ఈ సినిమాలోనూ మొదటి భాగాన్ని కుటుంబ సమస్యలు, హాస్య సన్నివేశాలతో ఆసక్తికరంగా నడిపించారు. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తారు. ముఖ్యంగా కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సంభాషణలు, పిల్లల సమస్యలు నవ్వులు పంచుతాయి. చిట్టిబాబుకు రూ.100 కోట్ల లాటరీ తగిలిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
అయితే రెండో భాగంలో కథ క్రైమ్, యాక్షన్ వైపు మళ్లుతుంది. పోలీసుల దర్యాప్తు, ముఠా నుంచి కుటుంబం ఎదుర్కొనే సమస్యలు కథలో ప్రధానంగా కనిపిస్తాయి. కానీ ఈ భాగంలో వచ్చే మలుపులు ముందుగానే ఊహించేలా ఉండటం కొంత నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల గతానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోవు. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. సత్య కామెడీ అక్కడక్కడా మాత్రమే నవ్విస్తుంది. రెండో భాగంలో కథనం మరింత బలంగా ఉండాల్సిందనే భావన కలుగుతుంది.
నటీనటుల నటన
చిట్టిబాబు పాత్రలో వెంకటేష్ తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. కామెడీ, కుటుంబ భావోద్వేగాలు రెండింటినీ చక్కగా పండించారు. ఈ సినిమాకు ఆయన నటన ప్రధాన బలం. స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి అమాయకమైన భార్యగా మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. పిల్లల పాత్రల్లో యువీనా, ప్రజ్వల్ బాగా నటించారు. పోలీస్ అధికారి పాత్రలో నారా రోహిత్ చక్కగా సరిపోయారు. సత్య కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పంచారు. రావు రమేష్, నివేతా పేతురాజ్, బ్రహ్మాజీ, రఘుబాబు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం
దర్శకుడు త్రివిక్రమ్ మొదటి భాగంలో కుటుంబ భావోద్వేగాలు, వినోదాన్ని బాగానే చూపించారు. అయితే రెండో భాగంలో కథనంపై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. థమన్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. నేపథ్య సంగీతం కూడా కొన్ని చోట్ల కథకు అంతగా సహకరించలేదు. రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.










