విధి నిర్వహణలో దాడిని ఎదుర్కొన్నప్పటికీ సంయమనం పాటించిన మహిళా కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) సిబ్బందిని ఆ దళం డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ ప్రశంసించారు. ఢిల్లీలోని కనాట్ ప్లేస్లో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో మహిళా నిరసనకారురాలు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
ఢిల్లీలోని కనాట్ ప్లేస్ ప్రాంతంలో న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన లెహ్రా దో తిరంగా మార్చ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఈ నిరసన చేపట్టింది.
ఈ కార్యక్రమంలో విధుల్లో ఉన్న మహిళా సీఆర్పీఎఫ్ సిబ్బందితో ఓ మహిళా నిరసనకారురాలు వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం ఆమె చెంపదెబ్బ కొట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, సంబంధిత మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
జూడో క్రీడాకారిణి అయినా సంయమనం
సదరు మహిళా సీఆర్పీఎఫ్ సిబ్బంది జూడోలో శిక్షణ పొందిన క్రీడాకారిణి కావడంతో పాటు ఆ దళం జూడో జట్టులో సభ్యురాలని జీపీ సింగ్ తెలిపారు. అయినప్పటికీ విధి నిర్వహణలో తీవ్ర సహనం, పట్టుదల, సంయమనం ప్రదర్శించారని ప్రశంసించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు సీఆర్పీఎఫ్ కట్టుబడి ఉందని, ఈ ఘటనపై సంబంధిత పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిరసనకారులపై కనీసం మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. నిషేధాజ్ఞల ఉల్లంఘన, నిరసన ర్యాలీ ద్వారా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించడం, విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మహిళా సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.











