అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు జెట్ విమానం కుప్పకూలింది. గాల్లోనే విమానం అదుపుతప్పి, వేగంగా కిందికి దూసుకొచ్చి జనావాసాల సమీపంలో కూలిపోవడంతో భారీ అగ్నిగోళం ఏర్పడింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు.
అయితే కొద్దిసేపటికే పరిస్థితి మరింత దిగజారింది. విమానం వేగంగా కిందికి దిగడం ప్రారంభించింది. నిమిషానికి 10 వేల అడుగుల వేగంతో కిందికి దిగుతున్నామని పైలట్ మొదట అత్యవసర సందేశం పంపారు. ఆ తర్వాత ఈ వేగం 20 వేల అడుగులకు చేరిందని తెలిపారు. చివరకు మేము నేలను ఢీకొట్టబోతున్నాం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
నియంత్రణ కోల్పోయిన విమానం
విమాన ప్రయాణ సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఒక దశలో విమానం నిమిషానికి 30 వేల అడుగులకు పైగా వేగంతో కిందికి దూసుకొచ్చినట్లు గుర్తించారు. విమానం కుడివైపు తీవ్రంగా వాలుతూ నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. గాల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
విమానంలో మంచు పేరుకుపోవడం, వర్షం, గాలి కుదుపులు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి ముందు ఎదురయ్యాయని విమాన సిబ్బంది సంభాషణల ద్వారా వెల్లడైంది. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
ప్రమాద స్థలం, సహాయక చర్యలు
ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ పరిధిలోని గ్రీన్ఏకర్స్ ప్రాంతంలో మిలిటరీ ట్రైల్, 10వ అవెన్యూ నార్త్ సమీపంలో విమానం కూలిపోయింది. రహదారి పక్కనే భారీ గుంత ఏర్పడగా, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మంటలు ఎగసిపడటంతో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. ఘటనాస్థలికి అగ్నిమాపక, అత్యవసర సహాయక బృందాలు చేరుకున్నాయి. సమీపంలోని మొబైల్ హోమ్ నివాస ప్రాంతం నుంచి ముందు జాగ్రత్తగా సుమారు 600 మందిని అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాదం జరిగిన సమయంలో నేలపై ఉన్నవారికి ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తొలుత సమాచారం లేదని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ తెలిపారు.
దర్యాప్తు ప్రారంభించిన అమెరికా సంస్థలు
ప్రమాదంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు () దర్యాప్తు చేపట్టాయి. విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది వివరాలను అధికారులు వెంటనే వెల్లడించలేదు. విమానానికి మంచు పేరుకుపోవడం, వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలు ప్రమాదానికి కారణమయ్యాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












