జనగామ జిల్లా, పాలకుర్తి మండలం పరిధిలోని గూడూరు ZPHS పాఠశాలలో ఇన్ఫోసిస్ సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్లను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సాంకేతిక విద్యకు చేయూత లభించింది.
గూడూరు ZPHS పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ శ్రీమతి రాపాక స్వాతి, CSR కో ఆర్డినేటర్ శ్రీ రాపాక నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు పాఠశాలకు అవసరమైన కంప్యూటర్లను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీమతి స్వాతి, శ్రీ నాగరాజు, కంప్యూటర్లు గ్రామీణ విద్యార్థులకు ఆధునిక జ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పట్టణ విద్యార్థులతో సమానంగా పోటీపడేందుకు ఈ పరిజ్ఞానం అవసరమని, ముఖ్యంగా బాలికలు, మహిళలు కంప్యూటర్ విద్యను అభ్యసిస్తే ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇన్ఫోసిస్ ఫౌండర్ సుధా మూర్తి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ బహుకరణ జరిగిందని, విద్యార్థులు కంప్యూటర్లను సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప పుల్లయ్య, ఉపసర్పంచ్ కళ్యాణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.








