జనగామ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్రెడ్డి పట్టణంలోని పలు గణపతి మండపాలను సందర్శించి, భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
పట్టణంలోని 18వ వార్డులో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ఎమ్మెల్యే సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 22వ వార్డులోని పలు గణపతి మండపాలకు వెళ్లి గణనాథుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జనగామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శ్రీ విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీ మేరకు స్పందించి షెడ్ నిర్మాణానికి కృషి చేసినట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
జనగామ పట్టణంలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. పండుగలు ఆధ్యాత్మికతతోపాటు ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం, ఐక్యతను పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షించారు. జనగామ ప్రజల సంతోషమే తనకు ముఖ్యమని, నియోజకవర్గ అభివృద్ధితోపాటు ఆలయాలు, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గణపతి మండపాల నిర్వాహకులు, భక్తులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

